Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ కుర్రాడి వయసెంతన్నది అనవసరం.. భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం: బ్రెట్ లీ

Vaibhav Suryavanshi age does not matter he is a gem for Indian cricket says Brett Lee
Advertisement
  • వైభవ్ సూర్యవంశీ వయసుపై చర్చ అనవసరమన్న బ్రెట్ లీ
  • భారత క్రికెట్‌కు దొరికిన అద్భుతమైన ఆటగాడని ప్రశంస
  • ఐపీఎల్‌లో భయంలేకుండా ఆడి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్
  • ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను సైతం సమర్థంగా ఎదుర్కొన్నాడని కితాబు
  • భవిష్యత్తులో పేరు, అంచనాలను నిలబెట్టుకోవడం అతడికి సవాల్ అన్న మాజీ పేస‌ర్‌
Advertisement
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ వయసు చుట్టూ జరుగుతున్న చర్చ అనవసరమని, అతనిలో అపారమైన ప్రతిభ ఉందని, భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలు అందించగలడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే 'బీర్ బైసెప్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ బ్రెట్ లీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"భారత్ బయట, ప్రపంచవ్యాప్తంగా అందరూ వైభవ్ వయసు నిజంగా 15 ఏళ్లేనా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అతిపెద్ద టాకింగ్ పాయింట్. కానీ, అతడి వయసు ఎంతైతే నాకేంటి? 15 అయినా, 17 లేదా 18 అయినా పర్వాలేదు. ఈ కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాడు. భవిష్యత్తులో అతను మరెన్నో గొప్ప విజయాలు సాధించబోతున్నాడు" అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన భయంలేని ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ల పేరు, ప్రతిష్ఠ‌లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో భారీ షాట్లతో చెలరేగాడు. అతని అసాధారణమైన బ్యాట్ స్పీడ్, దూకుడైన బ్యాటింగ్ అతన్ని టోర్నమెంట్‌లోని యువ స్టార్ల‌లో ఒకడిగా నిలబెట్టాయి. ఐపీఎల్‌లో కనబరిచిన ఈ అద్భుత ప్రదర్శనతోనే, అతనికి భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా, జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా పుంజుకుని 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఇది ఎటువంటి ఒత్తిడిలోనైనా రాణించగల అతని సామర్థ్యాన్ని తెలియజేసింది.

వైభవ్ బ్యాటింగ్‌లోని పరిణతిని బ్రెట్ లీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతను చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నాడు. "ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తుంటే, వైభవ్ ఏమాత్రం భయపడకుండా తన ముక్కు మీదుగా హుక్ షాట్లు ఆడాడు" అని కొనియాడాడు. అయితే, ఇంత చిన్న వయసులో అనూహ్యంగా వచ్చిన పేరు ప్రఖ్యాతులు, అంచనాలను తట్టుకుని నిలబడటమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్ అని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.
Advertisement
Advertisement
Vaibhav Suryavanshi
Brett Lee
Indian Cricket
IPL 2026
Vaibhav Suryavanshi age controversy
Cricket News

More Telugu News